జ్యోతిలక్ష్మి


నాకు తెలుగు సినిమా పరిజ్ఞానం తక్కువ . ఒకటి ఆసక్తి లేదు . చిన్నతనంలో  మా పెద్దవాళ్ళు మమ్మల్ని సినిమాలకి పంపేవారు కాదు . నా అంతటి  దాన్ని నేను అయిన తరవాత కూడా   నాకు దానిమీదికి మనసు పోనందువలన..  నేను  తెలుగు సినిమాలని  చాలా ఏమీ చూడలేదు . 

అదీకాక  ప్రపంచవ్యాప్తంగా ఉన్న మంచి సినిమాని చూసే అవకాశం నాకు బాగా దొరికింది . పూనాపిల్మ్ ఇనిస్టిట్యూట్లో నేను 94 లో ఫిల్మ్ అప్రిషియేషన్ కోర్స్ చేశాను . అంతకుముందు అమెరికాలో ఉన్నప్పుడూ రకరకాల మంచి సినిమాలని చూశాను . ఆ తరవాత ఇక్కడా  అంతర్జాతీయ సినిమాని బాగానే చూశాను . అందువలన ఒక మాధ్యమంగా సినిమాతో నాకు మంచి పరిచయమే ఉంది . తెలుగులో నేను పాత సినిమాలలో ఉన్న మంచిపాటలని విన్నాను . వాటి చిత్రీకరణ చూడలేదు . ఎందుకంటే వాటిమీద నాకున్న ఒక సరదా ఏమన్నా  ఆ నటీనటుల ముఖాలని  వాళ్ళ డాన్స్  లని  చూస్తేగనక   ఎక్కడ జారిపోతుందో ఏమో అన్న ఒక భయం వల్ల ! 

నాకు పాత సినిమా పాటలలో  కొన్ని  నచ్చితే  అందుకు ప్రధాన కారణం వాటిలో ఉండే సాహిత్యం వల్ల .  నేను పాటల్ని విన్నదాన్నే  కానీ పాటల్ని  చూసినదాన్ని కాను. నాకు కృష్ణశాస్త్రి , మల్లాది రామకృష్ణ శాస్త్రీ , సముద్రాల రాఘవాచారీ,  శ్రీ శ్రీ ... ఇట్లా ఆ పాట  రాసిన వారి సామర్ధ్యం బట్టీ  ఆ పాట  బాగుంటే  "విని " ఆనందించడమే ! సినిమాలోని పాటల చిత్రీకరణ విషయంలో నాకు తృప్తి చాలా తక్కువ కలుగుతుంది . కవుల సున్నితమైన ఊహని చాలాసార్లు నృత్యదర్శకులు అందుకోలేరు . అందునా సినిమాలో వాళ్ళ దృష్టి కేవలం డబ్బులు మాత్రమే గనక అక్కడ "ఈస్తటిక్స్" కి చోటు ఉండదు .  మరి మంచి యుగళ గీతాలనే చూసి భరించలేని నేను సినిమాలలో ఆడవాళ్ళ వొళ్ళు ని చూపించి కేవలం పదార్ధమయంగా, వొట్టి అవయవాల మయంగా  ఆడవాళ్ళ శరీరాల్ని  ప్రదర్శించే  వేరే రకాల డాన్సులని చూసే వీలే లేదు .  నా స్వభావానికి అలాంటి రెండర్ధాల డాన్సులు నప్పవు . వాటిలో నేను సంతోషించగలిగిన  ఒక "కళాత్మకత" అన్నది ఏదీ ఉండదు. శృంగారాన్ని  చవక బారుగా రచ్చ్చకీడ్చే   ఒకలాంటి  వెకిలితనం నాకు సంతోషకారి కాదు .
 
ఇంతకీ ఈ విషయం ఎందుకని చెబుతున్నానూ అంటే -- సినిమాల ని గురించీ ఓ అదేపనిగా గోలగా  మాట్లాడేసే చాలా మంది  ఈమధ్య జ్యోతిలక్ష్మి అనే ఒక సినిమా నృత్య కళాకారిణి హఠాత్తుగా చనిపోతే  అన్నేళ్లు ఆవిడ చూపించిన వొళ్ళు ని చూసిన  వాళ్ళైనా  కనీసం  తమ  సంతాప  ప్రకటనని చేయలేదే ! అని  నాకు అనిపించింది . ఒక హీరో గనక పొతే  ఆత్మహత్యల్ని చేసేసుకునే  ప్రేక్షక జనం  ఇప్పుడు  అదే   జ్యోతిలక్ష్మిని  చూసి ఆనందించిన అనేకులు అలా గమ్మున ఎలా ఉన్నారో? ఒక హీరో చావు అత్యంత గొప్పదీ ఒక కేబరే డాన్సర్ మృత్యువు నిశ్శబ్దంగా ఉండవలసిందీ ఎందుకైందీ ? ఇదే నాకు కోపం తెప్పించే విషయం. నన్ను బాధ పెట్టే  విషయం అవుతుంది . అందుకని  నేను జ్యోతిలక్ష్మి వంటి ఒక గొప్ప నృత్య కళాకారిణికి  నా ఈ  ఆర్టికల్ ద్వారా నా సంతాపాన్ని ప్రకటిస్తున్నాను.  అందునా చాలా  భాషలలో కొన్ని వందల సినిమాలలో నటించీ  అవిరామంగా  నృత్యం చేసీ  అందులోంచే  తన వ్యక్తిత్వాన్ని నిలబెట్టుకున్న ఒక కళాకారిణిని గురించి రాయకపోతే ఎలా?

అయితే జ్యోతిలక్ష్మి ని గురించిగానీ , ఆమె సినిమాల గురించిగానీ,  ఆమె డాన్సుల గురించిగానీ ఏమీ తెలియని నేను ఏమి రాయాలీ ?  ఇది నాకు విషయం కాదు . ఎందుకంటే నేను ఆమె డాన్సులలోని విశేషాలని గురించీ విలువలని గురించీ రాయాలని అనుకోవడమే లేదసలు . అవి నాకు తెలియని సంగతులు . అయినా నేను రాయాలి . ఎందుకంటే ఆయా కుటుంబాల నించీ వచ్చిన   అనేకానేక కళాకారిణులని ఎలాగైతే ఈ ప్రపంచం మరిచిపోయిందో ఈమె గురించి కూడా కొన్నాళ్ళకి ఈ ప్రపంచం మరిచిపోవచ్చు . ఎందుకంటే వాళ్ళని గురించి వాళ్ళే నసుగుతూనో  లేదా నిశ్శబ్దం పాటిస్తూనో   ఇన్నాళ్లు అలా బతికేసేరే?  ఈ ఆధునిక కాలంలో సైతం వాళ్ళనిగురించి మాట్లాడకపోవడం ఏమిటీ?  వాళ్ల  వాళ్ళు సైతం అసలు మాట్లాడకపోవడం ఏమిటీ? వాళ్ళు సినిమా రంగం లోకి వచ్చిన కారణాల్లో లేక ఇష్టాలో  పోనీ వారి అయిష్టాలో ఆయా జీవితాల్లో ఎందుకని తెలియలేదు ఎవరికైనా ? వీళ్లంతా కూడా తంజావూరు దేవదాసీ కుటుంబాల వాళ్ళు ! వాళ్ళ వెనక ఒకనాడు గానంలోనే, నాట్యం లోనే ఒక గొప్ప సంప్రదాయం వర్ధిల్లింది . అదీ ముఖ్య విషయం నేను మాట్లాడడానికి ! 

దేవదాసీ వ్యవస్థని మొదలుకంటా నరికేసేమన్న ఒక సంతోషంతో బ్రిటీషువారి విలువలతో  "మంచి " వారందరూ  అంటే ఆధునికమైన చదువులు చదివిన ఉన్నత వర్గాలవాళ్ళు  చాలా మంది కలిసి చాలా చదువుకున్న ఒక దేవదాసీ కుటుంబం నించీ వచ్చిన  డాక్టర్ ముత్తులక్ష్మీ రెడ్డిని ముందుబెట్టి మరీ ఉద్యమం చేసి మొత్తానికి బ్రిటీషు వారి కి సంతోషం కలిగేలా, మనకి స్వాతంత్య్రం రాగానే మొట్టమొదటగా  ఆనాటి దేవదాసీ వ్యవస్థ ని భూస్థాపితం చేసే ఒక చట్టాన్ని తీసుకుని వచ్చారు . అందుకు ఆనాడు  ఎందరో బయటికి సంతోషించారు కూడా ! ఈ విషయాలన్నీ మీకు ఆనాటి సాహిత్యం లో సైతం దాని మంచి చెడు లతో సహా చర్చింపబడి ఉంది . చదువుకొండి .

అయితే ఈ చట్టం ద్వారా ఒక్కసారిగా  అనేక ప్రాంతాలలోని అనేకానేక దేవదాసీలు రోడ్డునపడ్డారు. వాళ్ళని సంస్కరించడం కోసం ప్రభుత్వం శరణాలయాలు  తెరిచింది.  నాట్యగత్తెల ముందు కుట్టు మిషన్లు పెట్టింది. వాళ్ళ మడి మాన్యాలు లాక్కుంది . వాళ్ళని  ఒకే ఒక్క చట్టంతో దిక్కులేని వాళ్ళని చేసింది . వాళ్ళు ఆధునికమైన చదువులు చదివిన వాళ్ళు కారు . ఈ సమాజం వాళ్లకి ఒక వృత్తిని నిర్దేశిస్తే వాళ్ళు దాన్ని జీవికగా చేసుకుని " కళావంతులు " అన్న పేర తమకి ఒక  ప్రత్యేకమైన అస్తిత్వం ఉండటం వలన ఒక గర్వంతో  వాళ్ళు సంప్రదాయ కళల్ని పోషించుకుంటూ గొప్పగానే బతికారు . ప్రసిధ్ద కర్ణాటక గాయనీమణులంతా ఆ కుటుంబాల వాళ్ళే మొదట్లో ! వీణ ధనమ్మ, ఆమె కూతుళ్ళూ,ఆమె మనమరాళ్ళు ముక్త, బృందా.... నాట్యంలో అయితే బాలసరస్వతి, నృత్యంలో అయితే మైలాపురం గౌరమ్మ . ఈమె ఎందరికి  మదరాసులో ని మైలాపూర్ లో తమ  సంప్రదాయ నృత్యం నేర్పిందో !  ఆధునిక కాలంలోని తొలితరం ఉన్నత వర్గాల పిల్లలంతా ఈమె దగ్గర నృత్యాన్ని అభ్యసించినవారే ! సరిద  శారద  గారున్నూ  అంతే  గొప్ప సంప్రదాయ నృత్య కళాకారిణి . ఇంకా కర్ణాటక సంగీతంలో కోయంబత్తూర్ తాయి, ఏనాది సోదరీమణులూ, బెంగుళూరు నాగరత్నమ్మ , సేలం గోదావరి ... వీళ్లంతా చాలా గౌరవంతోనీ చాలా ఆత్మాభిమానంతోనీ  ఆనాటి మద్రాసు సమాజంలో బతికిన వాళ్ళు . మనకి తెలిసిన ఒక ఎం  ఎస్ సుబ్బులక్ష్మీ, ఒక ఎం  ఎల్ వసంత కుమారీ వంటి వారు కాక ఎందరో ఉన్నారు ఆనాటి దేవదాసీ కుటుంబాల వాళ్ళ వాళ్ళు !

 జీవిక కోసం తంజావూరుని, మధురనీ, అలాగే ఇతర దేవాలయాలకి అనుసంధానంగా  దేవదాసీలుగా అప్పటివరకు గడిపిన వీరంతా  ఒక్కసారిగా  ఈ  భోగాలని అన్నిటినీ పోగొట్టుకుని బయటికి రావలసి వచ్చిన పరిస్థితి గభాల్న వచ్చి పడింది. అలా అన్నీ పోగొట్టుకుని మిగిలి , బతకడం కోసం మొదటగా  ఆనాటి  నాటకరంగంలోకీ, అక్కడినించీ ఆ తర్వాత వచ్చిన సినిమా రంగంలోకి  వచ్ఛారు ఈ దేవదాసీలు కుటుంబాల ఆడవాళ్లు ! ఇలా  వచ్చిన దేవదాసీలలో   పేరు పొందిన వాళ్ళు చాలా మందే  ఉన్నారు . తొలితరం సినిమా నాయికలు చాలా మంది  ఈ వర్గాల వాళ్ళే . సినిమాలలో తొలితరం లో  ప్లేబాక్  గాయనిలుగానూ  వీళ్ళే పనిచేశారు . పీ . ఏ . పెరియనాయకి గాత్రం లో  అలాగే  ఆమె కుమార్తెలైన  ప్రఖ్యాత నృత్యాంగనలు   సాయి - సుబ్బులక్ష్మి   సోదరీ ద్వయం  ఇట్లా  చాలా మంది .   నృత్యం లోకి వచ్చిన వాళ్ళు కొందరైతే, నటనారంగంలో పేరు తెచ్చుకున్నవారు  మరికొందరు . టి ఏ మధురం లాంటి వాళ్ళు  చాలా మంది ఉన్నారు . వీళ్లనిగురించి అసలు ఒక వేరే వ్యాసమే రాయవలసి ఉంటుంది  ఈ పరిధి దానికి చాలదు . ప్రస్తుతం విషయానికి మాత్రం క్లుప్తంగా ప్రస్తావనగా మాత్రమే ఇక్కడ చెబుతున్నాను. 

అలా ఆ తంజావూరు  నించీ వచ్చిన  ఒక నటి S.P.L .ధనలక్ష్మి . ఈమె తన మేనకోడలిని సినిమాకి పరిచయం చేసింది . ఆమె  టి ఆర్  ఆర్  రాజకుమారి  . రాజకుమారి తొలిపేరు తంజావూరు రంగనాయకి రాజై . సినిమా కోసం ఆమె  టీ ఆ రార్ రాజకుమారి గా మారింది . చంద్రలేఖ సినిమా  నాయిక ఆమె . ఆమె సినిమాలన్నీ చాలా బాగా ఆడాయి , అవి దర్శక నిర్మాతలకి అలాగే  ఆమెకీ చాలా ధనం పేరూ తెచ్చిపెట్టాయి. ఒక్కసారిగా తమ భూములు పోగొట్టుకుని   పేదగా  అయిపోయిన వీళ్లంతా మళ్ళీ వేరొక విధంగా డబ్బునీ, పేరునీ, సినిమాల ద్వారా సంపాదించుకుని తమ కుటుంబాలని పోషించుకోగలిగారు . తమిళంలోనూ  తెలుగులోనూ పేరు గన్న ఈవీ సరోజ అన్న ఆవిడ ఈ రాజకుమారి తమ్ముడికి [ టీ ఆర్ ఆర్ రామన్ ]  రెండవ భార్య . వీళ్లంతా సినిమా ప్రొడక్షన్ లోకీ , దర్శకత్వం లోకీ, ఎడిటింగ్, sound engineering లాంటి ఇతర శాఖలలోకీ ప్రవేశించి ఆయా రంగాలలో  గొప్ప నిష్ణాతులూ అయ్యారు . కొందరు చివరి దశలో  డబ్బులు లేని వాళ్ళై  అలా అనామకంగా  చనిపోయారు . సంపాదించుకున్న ఆస్తులని  ఆధునిక  విద్యలు లేని కారణం వల్ల సరిపడా   జాగ్రత్తలు తీసుకోలేక మళ్ళీ తమ ఆస్తుల్ని  పోగొట్టుకున్నారు. ఎందరో తమకి అభిమానులని సంపాదించుకోగా మరికొందరు అలా అనామకంగా తెర మరుగైపోయారు.  మరికొందరు తమ పిల్లలికి పెళ్లిళ్లు చేసి తమ సంప్రదాయ వృత్తికి వాళ్ళని దూరం పెట్టారు . ఇలా ఆయా కుటుంబాలు తమ తొలినాటి వైభవానికి అనేక రకాలుగా దూరం అయినా ఎలాగో ఒకలాగా  మళ్ళీ బతికి బట్టకట్టారు , వేరే రకంగా తిరిగీ సమాజంలో ఒక స్థానాన్ని పొందారు . 

సంప్రదాయ కళలైన నాట్యం అలాగే శాస్త్రీయ సంగీత గానం వీరి రక్తంలోనే ఉన్నాయి .అవి వీరికందరికీ వచ్చితీరాలన్నమాట! గజ్జె కట్టి ఆడడం వారికి ఒక దైవ పూజ గనక దాన్ని అభ్యసించి తీరాలి .  సినిమా ప్రభావానికి లొంగకుండా కేవలం తమ కళనే నమ్ముకుని  చెన్నపట్నం చేరి  అక్కడ  ప్రముఖంగా జీవించిన వీణ ధనమ్మ ఆమె కుటుంబము చెప్పుకోదగ్గది . వీరు  ఎందరికో తమ  శాస్త్రీయమైన విద్య నేర్పారు . పెద్దగా తమ విద్య వల్ల  వీళ్ళు డబ్బుని సంపాదించలేదు . కానీ చాలా పేరునీ  సామాజిక  గౌరవాన్నీ సంపాదించుకున్నారు . అయితే  చివరి దశలో పేదరికాన్ని  అనారోగ్యాన్నీ పొందారు . అలా  కాకుండా కేవలం తమ సాంప్రదాయ విద్యలకి మాత్రమే గిరి గీసుకుని బతక వద్దనుకుని కాలానుగుణంగా మారిపోయి సినిమాలలోకి వచ్చి డబ్బు సంపాదించుకున్న వాళ్ళు కూడా ఈ దేవదాసీ వర్గపు కుటుంబాలలో ఉన్నారు . ప్రధానంగా దేవదాసీ వర్గాలది మాతృస్వామ్య వ్యవస్థ ! ఆ కుటుంబంలో కుటుంబ పోషణ కేవలం ఆడవాళ్లదే అవుతుంది . వాళ్లకి కూతురు ఉంటేనే బతుకు తెరువు ఉన్నట్టు! మగవారి పాత్ర కేవలం వీళ్ళకి చేదోడువాదోడుగా ఉండడం ,వీళ్ళకి తోడ్పాటు గా ఉండటమూను . 

వీరిలో చాలా మందిని గురించి ఇవాళ చాలా మందికి తెలియదు . వాళ్ళుకూడా తమ తమ కుటుంబ మూలాల్ని చెప్పేందుకు ఇష్టపడరు . అదీ విచారించవల్సిన విషయం ! సమాజం ఒక వర్గాన్ని చావు దెబ్బ తీయడం అంటే ఇదే ! ఒకప్పుడు వాళ్ళు తమగురించీ తమ మూలాల్ని గురించీ ఎంతో ఆత్మ విశ్యాసంతో మాట్లాడిన వాళ్ళే ! ఇవాళ అస్సలు వీళ్ళెవ్వరూ కూడా నోరిప్పరు తమ తమ గతాల గురించీ తమ మూలాల్ని గురించీను !
 
బహుశా ముందు తరాల అనుభవాలనీ వారు ఈ వ్యవస్థ చేత అతి దారుణం గా  దోపిడీకావడాన్నీ  స్వయంగా చూసిన వాళ్ళు కావడం వల్ల  కాబోలును  మలితరం వాళ్ళు చాలా మంది  "పెళ్లి  " కి ప్రాధాన్యం ఇచ్చుకున్నారు చేయిచాచి అడగనక్కరలేకుండా  బతకడానికి  తగినంత సంపాదించుకుని  పెళ్లి చేసుకుని వైవాహిక జీవితంలో స్థిరపడ్డారు. వీళ్ళలో చాలా మంది చాలా కట్టుదిట్టంగా, క్రమశిక్షణగా బతికిన వాళ్ళు సైతం  కన్పిస్తారు . వాళ్ళ గతం వాళ్ళ నెత్తిన ఒక కత్తిలాగా వెళ్ళాడుతున్నదని వాళ్లకి తెలుసు.  దాని గురించి బయటికి మాట్లాడే ధైర్యం గాని, అవకాశం గానీ ద్వంద ప్రమాణాలని  పాటించే ఈ సమాజం వాళ్లకి  అస్సలు ఇవ్వలేదు. ఇవ్వదు కూడా ! అన్నిటినీ ధిక్కరించగల్గిన వాళ్ళే ఈ చట్రాన్నీ  కూడా కాదని అనాలి. కానీ కోరి కోరి అలాంటి ఒక  కఠినమైన పరిస్థితి తో  వాళ్ళు ఎందుకని తలపడతారు గనకా? కానీ ఎదో ఒకనాడు అలాంటి ఒక నిర్భయమైన  రోజు వాళ్ళముందుకి తప్పక రావాలి అని మాత్రం  నేను కోరుకుంటాను. వాళ్ళ వాళ్ళ కుటుంబపు మూలాల్ని గురించి వాళ్ళు ఇబ్బంది పడకుండా మాట్లాడటమే మంచిది . వాళ్ళు దాన్ని గుర్తిస్తారా? నాకు సందేహం ! 

ఇంక చివరగా  మన జ్యోతిలక్ష్మి  ని గురించి .     చంద్రలేఖ సినిమా నాయిక అయినT.R.రాజకుమారికి  అత్త  .. S.P.L. ధనలక్ష్మి.  ఆ S.P.L. ధనలక్ష్మి  కుమార్తెలే  వీళ్ళు . జ్యోతిలక్ష్మీ, జయమాలినీ. ఇవి కూడా వీళ్ళ అసలు పేర్లు కావనుకుంటాను. జయమాలిని పేరు అలిమేలు మంగ. మరి జ్యోతిలక్ష్మి అసలు పేరు వేరే మరొకటి ఉన్నదా? నాకు తెలియదు . జ్యోతిలక్ష్మి దక్షిణాదిన అన్ని భాషలలోను కొన్ని వందల సినిమాలలో  కేబరే డాన్సుల్ని చేసింది . వేరే భాషలో అయితే   డాన్సర్ గా కాకుండా  మంచి నటిగా కూడా రాణించింది . 
  
 జ్యోతిలక్ష్మి  ని  కేవలం కేబరే డాన్సర్ గా మాత్రమే చూసింది తెలుగు సినిమా ప్రపంచం . కానీ అదే తమిళ మళయాళ  సినిమా రంగాలు ఆమె ని  ఎక్కువగా నటిగా  గుర్తించాయి.  జ్యోతిలక్ష్మి మాటలలో  హాస్యం, సమయస్ఫూర్తి,ఎంతో నిబ్బరం,ఆమె వృత్తి విషయంలో ఆమెలో   కనిపించే ఆత్మ విశ్వాసం...  ఇవన్నీ ఆమె ఇంటర్వ్యూ ని నేను చూసినప్పుడు   ఎక్కువగా  నన్ను  ఆకట్టుకున్న విషయాలు. అదే ఆమె అసలు వ్యక్తిత్వం  అని నాకు అనిపించింది. చివరితరం తంజావూరు దేవదాసీ కుటుంబాల వాళ్ళు వీళ్ళు . గొప్ప గాన నాట్య సంప్రదాయాలకు జన్మతః వారసులూను . కళావంతుల కుటుంబాల నించి వచ్చి  ఆ నృత్యకళ  తోనే  చివరికంటా బతికి  వెళ్ళిపోయిన వాళ్ళు !  సాహసంతో ..  నిర్భీతితో  తన శరీరాన్ని ప్రదర్శించిన ఆమె  తన సంప్రదాయ నృత్యంలో కూడా ప్రదర్శనల్ని ఇచ్చి ఉండి  ఉంటే   ఎలా ఉండేదో కదా ?  అన్న ఒక కుతూహలం మాత్రం నాలో కలిగింది . బహుశా ఒక యామినీ కృష్ణమూర్తి లాగానో, ఒక పద్మా సుబ్రహ్మణ్యం లాగానో ఉండేదేమో! 

-జయప్రభ .

Comments

Popular posts from this blog

నా పెళ్లి

శ్రీ కందాళ సుబ్రహ్మణ్య తిలక్ స్మృతి