శ్రీ కందాళ సుబ్రహ్మణ్య తిలక్ స్మృతి


             నేను 1986 లో నా కవితా సంకలనం " యుద్ధోన్ముఖంగా " పుస్తకపరిచయ సభ పెట్టేను . చిక్కడపల్లి సిటీ సెంట్రల్ లైబ్రరీ లో ! ఆరోజున  ఆ  పుస్తకం విడుదల ని  కందాళ  తిలక్ గారు చేయాల్సి ఉంది .  అందువలన మీరు ఆ పత్రాన్ని కలిగి ఉన్నవారైతే ,  గమనిస్తే గనక దాన్ని  ,  ఆ ఆహ్వానపత్రం లో కూడా తిలక్ గారి పేరే ఉంటుంది . పుస్తక ఆవిష్కర్త  శ్రీ కేఎస్ తిలక్ అని . సభాధ్యక్షత కాళోజీ వహించవలసి ఉంది . చేకూరి రామారావు తదితరులు వక్తలూనూ ! 


              ఒకసారి నేను ఆడియెన్స్ వేపు చూశాను .    ఒక పెద్దాయన  పంచె కట్టుతో  అక్కడ కూర్చుని ఉన్నారు అందరికన్నా ముందుగా వచ్చి . నేనా  ఎనభైలో సాహిత్య రంగ ప్రవేశం చేసినా నా చదువు కారణంగానూ  --- నా మనస్తత్వం కారణం గాను ఎక్కువగా ఎవరినీ కలిసిన దాన్నిగాను  . సాహిత్యరంగానా అంతే  !  పేర్ల ద్వారా కవులు - కథకులూ  పరిచయం ఉన్నా  -- ఎవరివీ ముఖపరిచయాలు నాకు ఆనాడు ఈనాడు కూడా  అంతగాలేవు  .  పైగా  అప్పటికింకా తెలుగు సాహిత్యానికి  నేను కూడా   కొత్తదానినే ! దాశరధి రాసిన ముందుమాట ఒక్కటే ఆనాటికి నా సాహిత్య రంగ ప్రవేశానికి ఆమోద పత్రం ! :)  అలాగే  ఈ  హైద్రాబాద్ వూరు సైతం నాకు ఆనాటికి బాగా తెలుసును అనీ చెప్పలేను కూడా ! నా ప్రపంచం అంతా  ఉస్మానియా యూనివర్సిటీ . నా సహా విద్యార్థులూ  .. ఇంకా కొందరు అక్కడి మిత్రులు .  ఆ  యూనివర్సిటీ రాజకీయాలూ ! ఇవే ! సాహిత్యంలోని వ్యక్తుల చిరునామాలు  సైతం ఇంకా నాకు తెలియని కాలం అది . దాశరధి , నారాయణ రెడ్డి , ఇంకా నా సమకాలపు కుర్రకవులు కొందరు  , ఇంతే ఆనాటికి నా పరిచయాల  పరిధి ! పేరుకి నేను ఉత్తరాంధ్రా అమ్మాయినే కానీ ఉత్తరాంధ్రలో  కూడా ఆనాటికి నేను అంతగా తెలిసే వీలు లేదు . ఎందుకంటే నాకు సాన్నిహిత్యం  ఎక్కువగా తెలంగాణా తోనే ! 

                 అందువలన నేను ఆ పెద్దాయనని  గుర్తుపట్టలేదు . చూసి చూసి ఆయనే నన్ను పిలిచారు . తిలక్  గారు ఏరీ ? అని అడగడానికి అని  . అందువలన నాకు ఆయన తిలక్ గారి కోసం వచ్చిన పెద్దమనిషి అని  మాత్రమే అర్ధం అయ్యింది . ఇంకా రాలేదండీ అని  ఆయనకి  జవాబు ఇచ్చేను . తరవాత కుదరక ఎదో పనిబడి  మా  తిలక్ గారు నా పుస్తకావిష్కరణకి రాలేదు . అందువలన సభకి అధ్యక్షత వహించడానికి వచ్చిన కాళోజీ నే  ఆరోజు  నా " యుద్ధోన్ముఖంగా  "పుస్తక ఆవిష్కరణ కూడా చేశారు . అలా  ఎనభైలతో మొదలుపెట్టి ఆయన పోయేదాకా కాళోజీ నాకు సన్నిహితులు గానే మిగిలారు .   ఆవేళ  వచ్చిన వాళ్లంతా ఆ ఆడియెన్స్ లో కూర్చున్న  పెద్దాయనని వచ్చి పలకరించి వెడుతున్నారు . అందువలన నాకు కుతూహలంకలిగి ఎవరినో అడిగాను  "ఆయన ఎవరూ ? " అని . వాళ్ళు ఆశ్చర్యంగా నీకు తెలియదా ? ఆయన  "చాసో " కదా ! అన్నారు . నేను పేరు వినడమే తప్ప నిజానికి చాసో [  ప్రముఖ కథా రచయిత చాగంటి సోమయాజులు , మా ఉత్తరాంధ్రా  అభ్యుదయ రచయితలలో అగ్రగణ్యులు ] కధలని వేటినీ అప్పటికి చదివింది లేదు . ఆ  తరవాత కూడా  నేను ఆయన కధల్ని చదివింది  తక్కువే !  " కుంకుడాకు  " కధ కాక నా అభిరుచికి ఆయన కధలు నప్పలేదని  ఎందుకో  గుర్తు . అలా చాసో నాకు రచయితగా కూడా సన్నిహితం కాలేదసలు !  . అయితే  చాసో  నాకోసం కాక  ఆవేళ సాయంత్రం కందాళ తిలక్ గారి కోసం అని వచ్చారు  :)  రాజకీయాలు కాక తిలక్ గారికి సాహిత్యంతో ఏమీ అనుబంధం లేదు . నా రచనలని మాత్రం చదివి మెచ్చుకునేవారు తిలక్ గారు . 

                 ఇదివరకూ  కూడా ఒకసారి నేను ద్రావిడ బ్రాహ్మలని గురించి వివరించి ఉన్నాను . నేను ద్రావిడ బ్రాహ్మల వర్గానికి చెందిన  అమ్మాయిని .  ద్రావిడ బ్రాహ్మల వర్గం నించి  ఇతర వచ్చిన ప్రముఖ కవులు రచయితలూ , విప్లవ సంఘాల నేతలూ సోషలిస్టు నాయకులూ కూడా   బాగానే ఉన్నారు . తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నం చేసిన ఆదిభట్ల నారాయణదాసు , అలాగే  చెళ్ళపిళ్ళ వెంకట శాస్త్రీ  , శ్రీశ్రీ ,    శ్రీరంగం నారాయణ బాబు , ఆరుద్ర , వీరంతా విజయనగరం జిల్లావారే !   ద్రావిడ  బ్రాహ్మణ వర్గం వారే ! పేరీ సుబ్బరాయ శాస్త్రీ  , పేరీ  కాశీనాధ శాస్త్రీ [ ప్రముఖ సంస్కృత పండితులు  పూసపాటి రాజావారి ఆస్థానాన ]   ,  పేరి  కాశీనాధ శాస్త్రి గారికి  స్వయానా  అల్లుడైన  శ్రీ  తాతా  రాయుడు శాస్త్రీ  , సంస్కృతంలో గొప్ప  వ్యాకరణవేత్త  , ఆ తరంవారే అయిన శ్రీ  పేరి  సూర్యనారాయణ శాస్త్రీ  వ్యాకరణ పండితులే  ! ఇలా చాలా మంది  ! ఆదిభట్ల నారాయణ దాసుగారి తరం వారు అందరూ  ఆనాటి  పూసపాటి రాజుగారి కొలువులో ఉన్నవారే !  వీరిని పోషించిన  ఆనంద గజపతి రాజుగారికి  కూడా  సంస్కృతం బాగావచ్చు . అసలు విజయనగరం  జమీందారులు  ముందునించీ కూడా  కాశీ లోని సంస్కృత విద్యాసంస్థలకు ఎన్నో   భూరి విరాళాలని ఇచ్చిన వారు . కాశీలో  మా రాజుగారికి చెందిన బంగ్లా ఉండేది . అక్కడికి వెళ్లి బ్రాహ్మణ వర్గాలవారు సంస్కృతం చదువుకుందికి వలసిన వసతులు  కూడా ఉండేవి .  . దువ్వూరి సుబ్రహ్మణ్య శాస్త్రిగారి ఆత్మకథ చదివితే  ,  ఆనాటి వీరందరి ప్రస్తావన విపులంగా వస్తుంది . చదవండి  అందరు ఆ పుస్తకాన్ని . చదవడానికి చాలా ఆసక్తిగా ఉండే పుస్తకం అది . బాగుంటుంది ఆ పుస్తకం .  తాతా రాయుడు శాస్త్రి గారికి  స్వయానా శిష్యులు మరి  దువ్వూరి వెంకటరమణ శాస్త్రుల వారు . 

                   అలాగే  ఇంక రాజకీయాలని చూస్తే  -- విప్లవకవులు , విప్లవ సంస్థల్ని తమ కార్యకలాపాలతో నాయకత్వంతో ఉద్దీపనం చేసినవారు కవులలో శ్రీశ్రీ ఎలాగో  విప్లవ రాజకీయాలలో ఆదిభట్ల కైలాసం [ పార్వతీపురం లో ఆ తరవాత వెంపటాపు  సత్యం మాస్టారితో కలిపి పోలీసుకాల్పులలో  మరణించినవారు ] నక్సలైట్ ఉద్యమ నాయకులు ద్రావిడులే  . అలాగే ఇటీవల  ప్రకాశం జిల్లాలో  హత్యకావింపబడిన  మావోయిస్టు పార్టీ నేత  గంటి ప్రసాద్ దాకా కూడా ఈ   ద్రావిడ బ్రాహ్మణ వర్గం నించి వచ్చిన వారే ! 

                  వీరిలాగానే  నిన్న తన 98 వ ఏట  వైజాగ్  లో కన్నుమూసిన  మాజీ ఎంపీ కందాళ సుబ్రహ్మణ్య తిలక్ గారు కూడానూ ! తిలక్ గారు మనసా వాచా  లోహియా సోషలిస్టు . ఆయన సైతం పూసపాటి జమీందారులకి దగ్గరి వారే ! గురజాడ అప్పారావు గారు ఎలా దగ్గరో అలా ! రాజుగారు [ పీవీజీ రాజు గారు ] తిలక్ గారి కాలంలో  ఉన్న విజయనగరపు జమీందారు . పీవీజీ రాజుగారు కూడా దేశ  రాజకీయాలలో చురుకైన పాత్ర పోషించిన వ్యక్తి . ఆయన జీవితకాలం సోషలిస్టు గా బతికిన వారు . పూసపాటి జమీందారులు ముందునించి ఆధునిక విద్యని అభివృద్ధి చేయడానికి అనేకమైన విద్యాసంస్థలని  ఆ ప్రాంతాలన్నిటా  నెలకొల్పినవారు . తమ సంస్థానాన్ని విద్యల నిలయంగా మార్చాలన్నది వారి ఆకాంక్ష . తమ ఆస్తులని చాలా వాటిని ఇందుకోసమే ఆ జమీందారులు వినియోగించినవారు . ఆ ప్రాంతంలో  సంగీత సాహిత్యాలు , ఆధునిక విద్యా అత్యంత వేగంగా అభివృద్ధి అయినాయి అంటే పంతొమ్మిదవశతాబ్ది తొలిభాగంలో ,  అందుకు ఈ ప్రముఖులందరి ఆలోచనలు , వారికి  విజయనగరం రాజావారిచ్చిన తోడ్పాటు ఇవన్నీ కారణాలు !  ఆనాటి యువతరం వారంతా ఈ జమీందారుల ఆలోచనా విధానాల వల్ల ప్రేరణపొందినవారే ! కందాళ సుబ్రహ్మణ్య తిలక్ గారు సైతం విద్యార్థి నాయకునిగా ఎదగడం -- ఆతరువాత క్రమంగా దేశంలోని సోషలిస్టు రాజకీయాలవైపు ఆకర్షితులవడం  ఇందువలన చాలా సహజంగా జరిగింది మరి . 

                      తిలక్ గారు  కూడా కాశీ  యూనివర్సిటీ లో చదువుకున్నారు .  తరవాత బెల్గాం నించి లా డిగ్రీ చేశారు .  తిలక్ గారికి స్వయానా చిన్నాన్న గారైన కందాళ  సర్వేశ్వర శాస్త్రి గారు  విశాఖపట్నాన ఆనాడు  ప్రముఖ న్యాయవాది . ఆయన దగ్గిర అసిస్టెంటు గా చేరితే చాలు ఈ కుర్ర లాయరుకి వృత్తిలో  అటు  పేరుకి పేరు డబ్బుకి డబ్బూ ఆర్జించడానికి బోలెడంత అవకాశం . అందరు ఆ సలహా చెప్పిన వారే ఆయన కుటుంబంలో ఆనాడు . కానీ తిలక్ గారు  మొదటి నించీ  ఆర్జనకి వ్యతిరేకి . సొంత ఆస్తికి వ్యతిరేకి .  ఆనాటికి ఉడుకురక్తం ఉన్న యువకుడు ఆయన . అందువలన ఆయన పూర్తిగా సోషలిస్టు రాజకీయాలవైపు తన జీవితాన్ని మళ్లించుకున్నారు . ఆ  తరువాత ఆయన జీవితం అంతా  ఈ దేశంలోని సోషలిస్టు రాజకీయాల చరిత్రతో పెనవేసుకుని నడిచినదే !  ఆచార్య నరేంద్ర దేవ్ ,  రామ్ మనోహర్ లోహియా  , అచ్యుత్ పట్వర్ధన్  , మధులిమాయె , కృపలానీ , మధు దండావతే , మినూ  మసానీ , అశోక్ మెహతా , యూసుఫ్ దేశాయ్ లాంటి  వ్యక్తులు ఆ నాడు సోషలిస్టు పార్టీలో పనిచేసినవారు . ఆకులపురుషోత్తం విశాఖలో సోషలిస్టు పార్టీ ని నడిపిన వ్యక్తి . దేశానికి ఇంకా స్వాతంత్య్రం రాకముందటి కాలం అది . అలాంటి రాజకీయవాతావరణపు ప్రభావం మా తిలక్ గారి మీద ఉంది . ఆయన స్టూడెంట్ నాయకునిగా ఉన్నప్పుడే అరెస్ట్ అయి జైలుకి వెళ్లిన వారు . 

                     ఇలాంటి తిలక్ గారిని ఆహ్వానించి ,  రైల్వేబోర్డు ని ఒకదానిని ఏర్పాటు చేసి దానికి తిలక్ గారిని చైర్మన్ ని చేశారు , మధుదండావతే  !  ఆయన జనతాదళ్ గవర్నమెంటు లో రేల్వే మినిస్టర్ గా ఉన్నప్పుడు  !  తిలక్ గారు అధికార వ్యవస్థకి నిజానికి వ్యతిరేకం . అధికారం  అన్నది మనిషిని అహంకారిని చేస్తుంది అన్నది ఆయన విశ్వాసం . అందరూ  నచ్చచెప్పి , మధు దండావతే మరీ మరీ  రమ్మంటూ  తనని పిలిచేక  , ఆయన సికింద్రాబాద్ రైల్వే బోర్డు కి చైర్మన్ గా ఒక రెండేళ్లు కాబోలు పనిచేశారు . రైల్వే ఉద్యోగానియామకాలు ఆయన ఆధ్వర్యంలో పరమ నిక్కచ్చిగా జరిగేవి . ఉద్యోగాలకోసం అని వచ్చి  , డబ్బులు లంచం ఇస్తే ఉద్యోగాలు రావొచ్చునన్న ఊహతో వచ్చే వారికి  , ఆయన నాయకత్వపు కాలం చాలా నిరాశని మిగిల్చింది . అలాంటి వారికి ఆయన కౌన్సిలింగ్ చేసి  తిరిగి పంపేవారు . ఆ సమయంలో ఆయన చిన్నకూతురు కూడా రైల్వే పరీక్ష రాసింది  , కానీ  ఆమె  అందులో ఉత్తీర్ణం అవలేదు . ఆ అమ్మాయికి కావాలంటే ఆయన  స్థానంలో ఇంకా ఎవరైనా  ఉంటె చాలా సునాయాసంగా  ఒక ఉద్యోగాన్ని వేయించుకోగలరు . కానీ ఆయన అలాంటిపని చేయలేదు . ఈయన ఆదర్శాలకు కుటుంబంలోని ఇతరులకీ ఇలా అనేకసార్లు  సంఘర్షణ వచ్చిన సందర్భాలు సహజంగానే  ఉండేవి ! అయినా ఆయన తన వైఖరితోనే  తలవొంచక బతికిన వ్యక్తి  చివరిదాకా !  మిఠాయిల పుల్లారెడ్డి  గారు  తిలక్ గారిని పిలిచి తాము నిర్వహించే ఒయాసిస్  పబ్లిక్ స్కూల్   నిర్వహణ  బాధ్యతని తీసుకోమని అన్నారు . తిలక్ గారు తన ఆదర్శనాలని చెప్పి చేరారు . కానీ   అక్కడ తనకి నప్పక కొన్నాళ్ళు పనిచేసి  మళ్ళీ అక్కడినించి వైదొలిగారు . కొన్నాళ్ళు భాగవతుల చారిటబుల్ ట్రస్ట్ కి ఆయన  పనిచేశారు . అక్కడా ఆయన ఇమడలేదు . ఆ ఆతరవాత " స్పందన " అన్న సంస్థని తానే  నెలకొల్పారు . తూర్పు గోదావరి ఏజెన్సీ ప్రాంతంలో  . .. ఆదివాసీల పిల్లల కోసం అని . అక్కడే వారికి భోజనం ఏర్పాట్లు ఉండేవి . ఆ కొండజాతుల పిల్లలంతా ఈయన ని తాతగారూ ! అని పిలిచేవారు . ఆయన " స్పందన " ని చూడడానికి అని నేను వెళ్లాను . 

                       స్ఫురద్రూపి , అందగాడూ  తిలక్ గారు .  . ఆయన పుట్టిన కొన్ని నెలలకే కన్నతల్లి తల్లిపోయింది . సవితి తల్లి తనని ఎంతబాగా చూసుకునేదో ఆయన  చాలా ఆర్ద్రంగా చెప్పేవారు . ఆయన భార్య కాంతం గారు మూడేళ్లకిందట [ 2015 లో ] కన్నుమూసేరు . ఆఖరిరోజుల్లో ఆవిడకి అన్నీ తానే అయి తిలక్ గారు సేవ చేసినవారు . ఆయన చాలా సంప్రదాయ బద్ధమైన మా  బ్రాహ్మణ కుటుంబంలోనే పుట్టినా  --  ఒక్కనాడు  ఆ వర్గానికి  సంబంధించిన  ఒక్క  నమ్మకం గాని , ఒక్క చాదస్తంగాని  ఏనాడూ అనుసరించిన వారు కారు . ఆయన సోషలిస్టు  రాజకీయమే ఆయన జీవితం కూడా  ! అరవై సంవత్సరాల వయసులో ఒక నవయువకునికి ఉండే ఉత్సాహం ఉద్రేకం ఆయనకీ   వ్యవస్థ బాగోగుల విషయంలో ఉండేవి . ఆయన జ్ఞాపకం మహా గాఢమైనది . చిట్టచివరి వరకు ఆయన నోట సోషలిస్టు రాజకీయాలు , దేశ  స్వాతంత్య్ర పు ముందటి పరిస్థితుల నించి , దేశ  స్వాతంత్య్రపు పిమ్మటి స్థితిగతులు , అందులోని లోటుపాట్లు వీటిని గురించిన విశ్లేషణ చాలా చురుకుగా ఉండేది . ఆయన కాంగ్రెస్ కి  వ్యతిరేకంగా మాట్లాడేవారు , అలాగే ఆయన ఆయుధ పోరాటం చేసే నక్సలైట్ల పంథాని సైతం ఒప్పేవారు కాదు . కానీ ఆయన దగ్గరికి ఆ కొండల్లో పనిచేసేటప్పుడు నక్సలైట్లు వచ్చి మాట్లాడి వెడుతూ ఉండేవారు ఆ ఏజెన్సీ ప్రాంతంలో ఆయన " స్పందన " సంస్థని నడిపినప్పుడు . చాలా అనర్గళంగా ఉపన్యాసాలని పైగా అర్ధవంతంగా మాట్లాడగల్గిన వక్త తిలక్ గారు . 

                 వెంపల్లి [ సిరిపూర్ కాగజ్ నగర్ కి దగ్గరగా ఉన్న అటవీ ప్రాంతం ]  లాంటి వూళ్ళో మగ్గుతూ ఉండే మమ్మల్ని సికింద్రాబాద్ కి ట్రాన్స్ఫర్ చేయడానికి ఆయన సహాయం కోసం అని కలిసాను నేను ఆయనని 1979 లో , ఆయన రైల్వే బోర్డు చైర్మన్ గా ఉన్నప్పుడు . నేనెవరో ఆయనకీ తెలీదు . ఆయన నాకూ తెలియదు . మిత్రులు చెప్పేరు ఒకసారి అడిగి చూడు . ఆయన చెప్తే ట్రాన్స్ఫర్  ఈ  సిటీకి అవొచ్చును అని . నేను ఆనాడు మొదటిసారి ఆయన చూసినప్పటి ఆ క్షణం నాకు ఇంకా గుర్తుంది . ఆయన నేను ఎవరో తెలియకున్నా నా అభ్యర్ధన ని విని సానుకూలంగా స్పందించారు . అలా నేను 1980 లో ఉస్మానియా యూనివర్సిటీలో చేరి నా 
 చదువులని  అన్నిటినీ  కొనసాగించగలిగేను .  . అలాగే విశ్వనాధ సూర్య నారాయణ కూడా ఉస్మానియా లా కాలేజీ లో చేరి లా డిగ్రీని సాధించేడు . అలా నా చదువులు నిరాటంకంగా కొనసాగడానికి తిలక్ గారు కారకులు ఇలా ! 

                 తిలక్ గారి ఆకర్షణ బలమైనది . కుర్రవాళ్ళని ఆయన  గభాల్న ఆకట్టుకునేవారు . వాళ్ళ  సామాజిక దృక్పధాన్ని ఆయన గాఢంగా  ప్రభావితం చేసేవారు . ఆదర్శవాది ఆయన . చివరికంటా తన ఆదర్శాలని  నిలుపుకుంటూనే బతికేరు . అత్యంత విద్యాధికుడై ఆయన సొంతానికి ఏమీ సంపాదించుకోలేదు . వావిలాల గోపాల కృష్ణయ్య గారిలాగానే ! ఈయన వైఖరి కుటుంబానికీ మరీ ముఖ్యంగా ఆయన  భార్యకి అర్ధం అయ్యేది కాదు . నప్పేదీ కాదు . అయినా కట్టుకున్నవాడు  అనీను  , వెనకటికాలం ఇల్లాలు  గనక నచ్చినా నచ్చకున్నా ఆవిడ అంచేత భర్తని అనుసరించేది అంతే ! ఆవిడ మెడలో మంగళ సూత్రాలు ఉండేవి కావు . నల్లపూసలూ ఉండేవి కావు . మా అమ్మా నాన్న గారల తరానికి చెందిన వారు కదా ?  అంచేత నాకు చాలా థ్రిల్ గా ఉండేది ఆయన చూపే ఆ ఆదర్శం అన్నా  ... ఆయన లోని ఆ  తిరుగుబాటు ధోరణి అన్నా !  నన్ను ఎప్పుడూ  " మా అమ్మాయి " అనే అనేవారాయన . నేను కూడా ఆయనని " నాన్నగారూ ! " అనే  పిలిచేదాన్ని ! అలా తండ్రి కూతుళ్ళ అనుబంధంగా  గడిచింది  ఆనాటి  కాలం ! 

               క్రమేపీ నేను నా బతుకులో నా రాతకోతల్లో  నా మార్గంలో బిజీ అయిపొయేను . నేను విశాఖపట్నానికి  ఏమంతగా వెళ్ళలేదు . ఏవో వారి నోటా వీరి నోటా  తిలక్ గారిని గురించిన  కబుర్లు వినడమే తప్ప  --  తొంభై దశకం దాకా కొన్ని ఉత్తర ప్రత్యుత్తరాలుగా కొనసాగినా  --  చివరికి ఆయన తో  నా సంభాషణ ఆగిపోయింది కొన్నాళ్ళకి . 2009 లో ఆయన పెద్ద అల్లుడు చాగంటి విజయకుమార్ కనిపిస్తే  నా అన్నమయ్య పద  ఆవిష్కరణ సభలో  -- తిలక్ గారు ఎలా ఉన్నారు ? ఏమిటీ ? అని విజయ్ కుమార్ ని అడిగి  కనుక్కున్నాను . ఆ ఆతరవాత నాకు మరి ఆయన ని గురించి తెలిసిందే లేదు . నిన్న మా చిన్నక్క ఫోను చేసి " ప్రభా ! నీకు తెలిసిందా ? తిలక్ గారు పోయేరుట " అన్న  వార్త చెప్పిన దాకా ! సన్నని విషాదం  నా మనసుని కమ్మింది గానీ -- పూర్ణాయుర్దాయాన్ని పొంది 98 సంవత్సరాల వయసులో మరి వెళ్లిపోవడం అన్నది కాల ధర్మమే కదా !  ఈ దేశంలో  కళింగాంధ్రమ్  నించి  చెప్పుకోవలసిన ముఖ్య సోషలిస్టు నాయకుడైన  శ్రీ  కందాళ  సుబ్రహ్మణ్య తిలక్  స్మృతికి  , ఇది నా నివాళి  ! 

జయప్రభ 

09-06- 2018

Comments

Popular posts from this blog

నా పెళ్లి

జ్యోతిలక్ష్మి